చిన్నపిల్లల మనసులు అప్పుడే పంటకు సిద్ధం చేసిన నేలలాంటివి. వాటిలో ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటివి మొక్కలే మొలకెత్తుతాయి. నీతి, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ లక్షణాలను బాలబాలికలకు అలవాటు చెయ్యడమన్నది కథల ద్వారా తెలియజేయడమన్నది అనాదిగా వస్తున్న ఆచారం. పసిమనసుల్లో ఇలాంటి నీతి బీజాలు నాటితే అవి అంత బలంగా వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి.
నా బాల్యంలో ఉన్నపుడు చందమామ ఈ పని చేయడంలో సఫలమైంది. మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ. చందమామలో ఒక్కో కథా ఒక్కో నీతి పాఠం. ముఖ్యంగా బేతాళ కథలు, జాతక కథలు సూక్ష్మమైన ధర్మ సూత్రాలు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు తెలియజేసేవి.
చిన్నప్పుడు మా ఇంట్లో ముగ్గురు చిన్నపిల్లలం. నేను, ఇద్దరు అక్కలు. అమ్మమ్మ దగ్గరుండి చదువుకున్నాం. తాతయ్య టౌనుకెళ్ళి చందమామ తెస్తున్నాడంటే ఆరోజు మాకు పండగరోజే. ప్రతినెలా చందమామ తెచ్చి చేతికివ్వగానే ముగ్గురం కలిసి దాన్ని ఒక్కరోజులో అవగొట్టేసే వాళ్ళం. ఎందుకంటే చందమామలో ఉండేవి మామూలు కథలు కావు. ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయే రెక్కల గుర్రాల్లాంటివి.
పెద్దయ్యే కొద్దీ బాహ్యప్రపంచపు వాస్తవాలతో మెదడు మొద్దుబారిపోతుందేమో గాని చిన్నపిల్లల ఊహలకు హద్దే లేదు. ఊహ ఎప్పుడూ ఆనందమే. అలాంటి ఊహలకు రెక్కలు తొడిగింది అందాల చందమామ.
కొరవ తదుపరి పుటలో చూడండి. |