చందమామను నేను పదవఏట నుంచి చదువుతున్నాను. ఇప్పుడు అరవై దాటుతున్నాయి. నేను రాజమండ్రిలో పుట్టాను. రాజమండ్రికి సమీపంలోని పేరవరం గ్రామంలో పెరిగాను. కళాశాల చదువు విశాఖపట్నంలో. ఉద్యోగం కూడా మా గ్రామానికి సమీపమైన ఆత్రేయపురం కాలేజీలో. అందుచేత బి.ఎ,ఎం.ఎ చదివిన కాలేజీ సమయం తప్ప బాల్య, యవ్వన, ఉద్యోగ దశ పేరవరం అనే గ్రామంలో గడిపాను. చందమామ రచయితగా పేరవరం నా ప్రాణం. చిన్నప్పుడు నేను చందమామ కోసం చూసిన ఎదురు చూపులు మరుపురానివి.
ఆలమూరు బ్రిడ్జి లేని రోజుల్లో రావులపాలెం గురించి ఎవరికీ అంతగా తెలియదు. అపుడు రావులపాలెం కాకుండా తరవాతి ఊరైన ఊబలంక ప్రధానంగా కేంద్రంగా ఉండేది. ఊబలంకనుంచి బొబ్బర్లంక బస్సుల్లో చేరుకుని లాంచీలో ప్రయాణించి రాజమండ్రి చేరుకునేవారు లేదా గోదావరిలో నావమీద ప్రయాణం చేసి గాని, ఆనకట్టలు నడిచి గాని ధవళేశ్వరం వెళ్లి సిటీ బస్సు ఎక్కి రాజమండ్రి వెళ్లేవారు. అప్పుడు బ్యారేజి సౌకర్యం లేదు. మొత్తం కోనసీమ అంతా బొబ్బర్లంక వచ్చి, రాజమండ్రి వెళ్లవలసి వచ్చేది. ఆ సమయంలో ఊబలంక ప్రయాణీకులకు విశ్రాంతి విడిదిగా అల్పాహార శాలలతో ఆశ్రయమిచ్చేది. పేరవరంకు రెండు మైళ్ల దూరంలో ఉన్న తరవాతి గ్రామం బొబ్బర్లంక.బస్సుకోసం ఎదురు చూడకుండా బొబ్బర్లంక నడిచి రాజమండ్రి వెళ్లేవాళ్లం. రైల్వే టికెట్ లాగ కుటుంబమంతా బొబ్బర్లంక వెళ్లాలనుకుంటే ముందు రిజర్వ్ చేసుకుంటే ఒక ఒంటెద్దు బండి ఉండేది. లేదంటే ఎంత గొప్పవాడికైనా నడకే శరణ్యం, పాలు పెరుగు మా ఊరిలోంచే వెళ్లేవి.ఆ ప్రయాణమొక చందమామలోని ప్రయాణ కథల వర్ణనకు సరిపోయేది. ఎందుకంటే నడిచి వెళ్లినప్పుడు రెండు ఆనకట్టలకు మధ్యలో పిచికల లంక అనే ప్రదేశాన్ని దాటేవాళ్లము. అది కథల మాంత్రికుడి అరణ్య వర్ణనను జ్ఞాపకం చేసేది. అయితే పాములూ, కోతులూ మాత్రమే ఉండేవి.
కాని అడవిలో వెళుతున్న అనుభూతి చందమామ కథలలోంచే వచ్చేదని చెప్పడానికి అప్రస్తుతమైనా ఇది రాశాను. రకరకాల వ్యక్తులు, సంఘటనలు, పిశాచాలు, దయ్యాలు ఈ నేపథ్యం గల చందమామ కధా జీవితం మేము సజీవంగా చూశాము. పెరట్లో దబ్బ చెట్టు కాయకపోతే చందమామ కథ చదివిన మేము లంకె బిందెలున్నాయని చెట్టు చుట్టూ తవ్వేశాము. లంకెబిందెలు దొరకలేదు గాని నేల గుల్లబారిందో ఏమో దబ్బచెట్టు కొద్ది రోజుల్లోనే పూత పూసి విరగకాసింది. చందమామ కథకు ఇప్పుడిదో వస్తువవుతుందంటే నాకు సంతోషమే!
కొరవ తదుపరి పుటలో చూడండి.
|