నా చిన్నప్పుడు అంటే రెండో తరగతి చదివేటప్పుడు ఇల్లు అలుకుతూ తన పేరు మరిచిపోయిన ఒక ఈగ సంగతి నన్ను చాలా కాలం పాటు వెంటాడింది. ఒక పక్క ఈగలను అనారోగ్య కారకాలంటూనే రెండో పక్క ఈగతో సాన్నిహిత్యం పెంచే పద్ధతిలో కథలు చదువుకోవడం అప్పట్లోనే విచిత్రంగా ఉండేవి. రానురాను తరగతి పుస్తకాల్లో చదువుకునే జానపద పౌరాణిక కథలు రాత్రివేళల్లో కలల రూపంలో ప్రత్యక్షమయ్యేవి. వాస్తవ ప్రపంచంలోని బాధలను మరిచి పోవడానికి ఊహల్లోకి జార్చే ఉపకరణాల మాదిరి బాలసాహిత్య కథలు పనికిరావడం నాకింకా గుర్తే.
పదిహేనేళ్లకి ఎస్సెస్సెల్సీ పరీక్షలు రాసి ఖాళీ నోటు పుస్తకాలు కనిపించేసరికి వాటిమీద రచనలు నింపాలనిపించేది. విన్నవీ, చదివినవీ, ఊహించుకున్నవీ సంఘటనలతో రాకుమారుల మీద కథలు (?) రాసే 'బాల' పత్రికకు పంపించేవాడిని. తొలి కథ అచ్చయిన రోజున నా సంతోషం చూడాలి! ఆకాశాన్ని నేలకు దింపినంత! అచ్చులో నా పేరు ఇంత గర్వకారణమవుతుందని నాకు తెలియదు.
ఆరోతరగతి, ఏడో తరగతి చదివే నాటికి నాకు నాలుగణాల విలువ చేసే చందమామ పరిచయమయ్యింది. పాఠశాల వ్యవస్థాపక కుటుంబానికి చెందిన భ్రమరాంబ అనే అమ్మాయి తరగతి గదికి చందమామను తీసుకువచ్చేది. ఉపాధ్యాయుడు ఆమె చేతనే కథలు చదివింప చేసేవాడు.
ఇక ఆ కథలు వింటూన్నంతసేపూ మా తరగతి మొత్తం ఒక అద్భుత ప్రపంచంలో విహరించేది. ప్రతి పుటలో ఒక బొమ్మ, చలన దశలో ఉన్న పాత్రల హావభావాలు, వారి శారీరక భంగిమలూ, గాలికి ఎగురుతున్న వీరుల దుస్తులూ, మాంత్రికుల ఈ భయంకర ముఖ కవళికలూ అచ్చమైన జానపద వాతావరణం వంటి అంశాలలో మైమరిచిపోయిన దశను కల్పించేవి. చక్కటి భాష, సంస్కారవంతమైన భావప్రకటనా, సహజమైన సంభాషణా శైలీ, పాత్రల మనస్సులు అర్థం చేసుకోవడం వంటివి అబ్బుతూ వచ్చేవి.
కొరవ తదుపరి పుటలో చూడండి . |