బాల్యం నుండి ఇప్పటికీ చందమామ మా జీవితంలో ఓ భాగం. అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షని రేకెత్తించిందే చందమామ.
అమ్మఒడిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ, స్వయంక్రీడా వినోదితమైన శైశవ దశలో, ఎవ్వరికైనా పంచభూతాలైన భూమి (మట్టి), ఆకాశం(చందమామ), అగ్ని (వెలిగే దీపం), గాలి, నీళ్ళు పరమ ఆకర్షణలు!
’అనగ అనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు’ అంటూ కథ చెబితే ’ఊ’ కొట్టటం వచ్చిన నాటి నుండే ఆకాశంలోని చందమామతో పాటు అరిచేతిలోని చందమామా పరమ ఆకర్షణే!
రంగు రంగుల బొమ్మలు; ఒంటికొమ్ము రాక్షసులు, చింతచెట్టు దెయ్యాలు, మాయల మారి మాంత్రికులు, బుద్ది చెప్పే గ్రామాధికారులు, మంచి దారిలోకి మారిపోయే గజ దొంగలు.... ఎన్నో పాత్రలు! ఇతిహాసాలు నేర్పిందీ చందమామే!
విచిత్ర కవలలు జానపద కథలతో వింత లోకాలకి తీసి కెళ్ళిందీ చందమామే!
చిన్నప్పుడు.... అప్పటి కింకా బడిలో చేరలేదు. నాన్న ప్రతి నెలా చందమామ తెచ్చేవాడు. నాన్న చందమామ బిగ్గరగా పైకి చదవాలంటే, ఇద్దరు ఆయన కాళ్ళు పట్టాలి. ఒకరు ఆయన తల దగ్గర కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా మర్ధన చెయ్యాలి. అప్పుడు గాని బిగ్గరగా చదివేవాడు కాదు.
తల దగ్గర కూర్చొన్న వాళ్ళు, బొమ్మలు కూడా కనబడుతుండగా కథ వినవచ్చన్న మాట. ఎప్పుడూ నేనే నాన్న తల దగ్గర కూర్చొనే అవకాశం పొందేదాన్ని. నాన్న కథలన్నీ ఒకసారి చదివి పెట్టేవాడు. అంతే! మళ్ళీ మళ్ళీ చదవమంటే "మొన్నే చదివాను కదమ్మా!" అనేవాడు.
కొరవ తదుపరి పుటలో చూడండి. |