చందమామ అనగానే గుర్తుకి వచ్చేవి - వడ్డాది పాపయ్య గారు వేసిన ముఖ చిత్రాలు, సంపాదకీయం కింద కొలను, హంసలు, పైన వెన్నెల విరిసే చందమామ, ఆ చిత్రంలో వస్తూ ఉండే మార్పులూ, శంకర్ గారి పొందికైన బొమ్మలు, చిత్రా గారి చిత్ర విచిత్రాలు, చక్కని తెలుగు, నచ్చే కథలు. చందమామతో ఇంకో తోబుట్టువుతోనో, స్నేహితులతోనో పెనవేసుకుని ఉండేటటువంటి అనుబంధమూను.
చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అభిమానులు చాలా మందికంటే విరుద్ధంగా తెలియనితనమో, పంచుకునే మనస్తత్వమో, పత్రికలను చదువుకోవడానికి అరువిచ్చి చాలా పోగొట్టుకున్నాము.
తర్వాత బంధువుల ఇంట్లో భోషాణంలాంటి పెద్ద చెక్క పెట్టె నిండా చందమామలుంటే వెళ్ళినప్పుడల్లా గబ గబా తీసుకుని చదివేదాన్ని. మమ్మల్ని కలవడానికి వస్తున్నావా, చందమామల కోసమా అని వారన్నా కూడా పట్టించుకునే దాన్ని కాదు. మరి వారు కూడా ఇంటికి పట్టుకెళ్ళనిచ్చే వారు కాదు కదా. మా ఇంటికి చందమామ వచ్చే రోజుల్లో, చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, అందరు చందమామ అభిమానులలాగానే మాకూ పరిపాటిగా ఉండేది. మా బేరాలు ఇలా ఉండేవి.
బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేక పోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్ళం తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళం. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్ళం. అలా చూసుకుంటూనే ఉండే వాళ్ళం. ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్ళం.
(కొరవ తదుపరి పేజీలో) |