చందమామ - 70/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది.. :)
చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!
అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..
చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇల బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..
కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..
నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు - ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..
(కొరవ తదుపరి పుటలో) |