శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు నమస్కారం. సుబ్రహ్మణ్యం గారి ఆకస్మిక మరణవార్త మమ్మల్ని నిర్ఘాంతపర్చింది. ఆయన అస్తమయ వార్త చందమామకు తీవ్ర విచారకరమైన క్షణం. ఈ విషాదకర క్షణాల్లో ఆయన కుటుంబ సభ్యుల వేదనలో మేం కూడా పాలుపంచుకుంటున్నాము.
దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామలో 54 ఏళ్లపాటు సంపాదకవర్గ సభ్యుడిగా నిరవధికంగా పనిచేశారు. కథల పట్ల అంకిత భావం, సంపాదకవర్గ సభ్యుడిగా పాటించిన క్రమశిక్షణ, సహోద్యోగులతో నెరపిన స్నేహం, నిష్కల్మషమైన అభిమానం కలగలిసిన స్నేహశీలి ఆయన. ఆదినుంచి చివరిదాకా ఆయన చందమామలో వివాదరహితుడు.
చందమామ ధారావాహికల ద్వారా లక్షలాది మంది భారతీయ బాలబాలికల ఊహా ప్రపంచాన్ని ఆయన వెలిగించారు. దేశంలోని పిల్లలు పెద్దలందరికీ ఎంతో ఇష్టమైన పాత్రలను తన కథల్లో సృష్టించారు. పిల్లలతో పాటు పెద్దల మనస్సులను కూడా మంత్ర జగత్తులో విహరింపజేసి, ఓలలాడించిన రమణీయ కథాకథన శైలి ఆయన స్వంతం.
వ్యక్తిగతంగా, కథా రచనాపరంగా ఆయనకు సాటిలేరు. ఆయన మరణంతో మీతో పాటు భారతీయ పిల్లలందరూ చందమామ జానపద ధారావాహికల సృష్టికర్తను కోల్పోయినట్లుగా మేం భావిస్తున్నాం. ఆయన లేని లోటు మీకూ, చందమామకు కూడా ఏ రకంగానూ తీర్చలేనిది. మీరు బాధనుంచి బయటపడాలని, నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాం.
కుటుంబం ఓ మంచి వ్యక్తిని, భారతీయ పిల్లలు ఓ మంచి కథా రచయితను కోల్పోయిన ఈ విచారకరమైన క్షణంలో దాసరి గారి మృతి పట్ల చందమామ తన ప్రగాఢ సంతాపం తెలుపుతోంది. ఈ విషాదం నుంచి మీరు కోలుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాం.
ఆయన మృతి పట్ల చందమామ యావన్మంది కుటుంబ సభ్యులమూ తీవ్రవిచారం వ్యక్తంచేస్తున్నాము. దాసరి సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు, సోదరుడి కుమార్తె శ్రీమతి గోళ్ల ఝాన్షీ గారు ఈ విషాదంనుంచి కోలుకోవాలని ఆశిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.
ప్రశాంత్ ములేకర్ సీఈఓ, చందమామ |