చందమామ ధారావాహికల రచయిత, కొడవటిగంటి కుటుంబరావు సమకాలికులు దాసరి సుబ్రహ్మణ్యం గారిని ఆయన చివరిదశలో రెండుసార్లు కలిసి మాట్లాడిన ఏకైక వ్యక్తి, జర్నలిస్టు వేణుగారు. దాసరి గారి అస్తమయం వార్త నేపధ్యంలో ఆయనపై మళ్లీ బ్లాగులో జ్ఞాపకాలపై తిరిగి ఏదైనా రాస్తే బాగుంటుందని సూచించినప్పుడు, ఆయనను కలిసిన సందర్భాన్ని మననం చేసుకుంటూ వేణుగారు తన బ్లాగులో పోస్ట్ చేశారు. ఆ కథనాన్ని చందమామ వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే గత శుక్రవారం చందమామ వెబ్సైట్లో అపడేషన్ ముగిసే సమయానికి ఆయన అంగీకారానికి సంబంధించిన వార్త మాకు అందలేదు. దీంతో అనివార్యంగా వాయిదా పడిన ఆయన కథనాన్ని ఈవారం ప్రచురిస్తున్నాము.
తన బ్లాగులోని కథనాన్ని తిరిగి ప్రచురించడానికి అంగీకరించిన వేణుగారికి కృతజ్ఞతలు. అలాగే అరుదైన దాసరి గారి చివరి దశ ఫోటోలను కూడా చందమామకు అందించారు. అందుకు కూడా ఆయనకు కృతజ్ఞతలు. పత్రికలు, టీవీ ఛానెళ్లలో బేతాళ కథల సృష్టికర్త దాసరి అంటూ వచ్చిన తప్పువార్తను వేణుగారు ఈకథనంలో ఎత్తిచూపారు. ఈఅంశంలో వేణు గారి అభిప్రాయం సరైనదే. తన బ్లాగులో దాసరి గారితో తన పరిచయం, సమావేశాల భాగాన్ని మాత్రమే ఇక్కడ ప్రచురిస్తున్నాము. పూర్తి పాఠంకోసం ఈ కథనం చివరలో పొందుపర్చిన తన బ్లాగు లింకును చూడగలరు.
'I am overstay here' అని తన పెద్ద వయసు గురించి జోక్ వేసుకున్న అపురూప రచయిత దాసరి గారు.
‘కొ.కు.గారు 1980లో నాకన్న ముందుపోవడం నాకు తీరని ఆవేదన’ అంటూ బాధపడి, ఆ మాటలన్న ఎనిమిది మాసాలకే జీవితం చాలించారు.
2009 మేనెల మొదటివారంలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో రెండోసారి (చివరిసారి) కలిశాను.ఆయనకు వినికిడిశక్తి తగ్గిపోవటంతో రైటింగ్ పాడ్ మీద ఒక్కో ప్రశ్న రాసిస్తే, దానిమీదే స్వయంగా సమాధానాలు రాశారు.
సిగరెట్ తాగుతూ ఆ పొగ లోపలి గదిలోకి వెళ్ళకుండా ఆ తలుపు మూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. స్మృతులను నెమరువేసుకున్నారు. ‘స్మోకింగ్ని మాత్రం వదల్లేకపోయాను’అని ఒప్పుకున్నారు, అడక్కుండానే.
( కొరవ తదుపరి పుటలో చూడండి .)
|