‘చందమామ’ తొలినాటి వెలుగుల్లో మరొకటి ఆరిపోయింది. దాసరి సుబ్రహ్మణ్యంగారు కాలం చేశారు. ఆయన గురించి చాలామందికి తెలియదు. 1947లో ‘చందమామ’ అనే పేరుతో చక్రపాణిగారు ప్రారంభించిన పిల్లల మాసపత్రికలో మా నాన్న కుటుంబరావుగారు 1952 దాకా చేరకపోయినప్పటికీ, ఆంధ్రపత్రికలో పనిచేస్తూ, చక్రపాణితో స్నేహం కారణంగా ‘చందమామ’ తొలి సంచికలకు కూడా కథలు రాసివ్వడం చేసేవారు. ‘తండ్రి కొడుకులు’వంటి సీరియల్ కథలు అలాంటివే. అలా 1952లో మా నాన్నతో బాటే దాసరి సుబ్రహ్మణ్యంగారుకూడా చందమామలో చేరారు. 2006 దాకా అందులోనే కొనసాగారు.
సుబ్రహ్మణ్యంగారికి ఫామిలీ ఏదీ ఉండేదికాదు. చందమామ ఆఫీసు ప్రాంతంలోనే గది తీసుకుని ఒంటరిగా ఉండేవారు. ఆయనకు పెళ్ళి అయి, ఒక కూతురుకూడా ఉన్నప్పటికీ ఆయనతో ఎవరూ ఉండేవారుకారని మానాన్న చెప్పారు. సుబ్రహ్మణ్యంగారి అన్నయ్యకు సినీనిర్మాత జి. రాధాకృష్ణమూర్తి అల్లుడు. ఆయన మా నాన్నకు కూడా తెలుసు. తాను తీసిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ప్రీవ్యూకు మమ్మల్ని పిలిచాడు.
సన్నగా, పొడుగ్గా, నవ్వుతూ కబుర్లు చెప్పే సుబ్రహ్మణ్యంగారు రాసే సీరియల్ నవలలు అందరిలాగే నాకూ ఇష్టమే. పేరున్నా లేకపోయినా మా నాన్న రచనలను చిన్నప్పుడే నేనెలా గుర్తుపట్టగలిగేవాణ్ణో అదే పద్ధతిలో సుబ్రహ్మణ్యంగారి శైలికూడా నాకు పరిచితంగానే ఉండేది.
1960లలో నేను స్కూల్లో చదివే రోజుల్లో చందమామ ఆఫీసుకు వెళ్ళినప్పుడల్లా ఆయనను చూసేవాణ్ణి. మానాన్న టేబ్ల్ పక్కనే ఆయన టేబుల్ ఉండేది. ఆ విధంగా ఆయన నన్ను చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉండేవారు. ‘మకరదేవత’ నాటినించీ తన 18 నెలల సీరియల్ ఒక్కొక్కటీ పూర్తవగానే ఆ ఇన్స్టాల్మెంట్ల పేజీలన్నిటినీ కలిపి, ఒకే పుస్తకంగా బైండ్ చేయించి నాకు తప్పక బహూకరించేవారు. ఒక్క తోకచుక్క తప్ప అవన్నీ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. తోకచుక్క రాసేనాటికి నేనాయన్ని చూడలేదు గనక అది నా చేతికి రాలేదు. మా కుటుంబ విషయాలన్నిటితో బాటు నా చదువు, ఉద్యోగం, పెళ్ళి వగైరా వివరాలన్నీ ఆయన తెలుసుకుంటూ ఉండేవారు.
సుబ్రహ్మణ్యంగారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా ఉండేవాడని మా నాన్న ఒకసారి చెప్పారు. చందమామ ఆఫీసు వాతావరణం ప్రశాంతంగా, ఫ్రెండ్లీగా ఉండేది కనక పనిచేసుకుంటూ అక్కడివారు చర్చించుకునే ఇతర విషయాలెన్నో ఉండేవి. సుబ్రహ్మణ్యంగారు తన అభ్యుదయభావాలనూ, అమెరికాపట్ల ద్వేషాన్నీ ఆయన మా నాన్నతో చర్చించే రాజకీయ విషయాలద్వారా వ్యక్తపరుస్తూ ఉండేవారు. రచయితగా, సాహితీవేత్తగా మా నాన్నమీద ఆయనకు ఉండిన గౌరవానికి ఇటువంటి రాజకీయవైఖరి కూడా తోడయేది. ఆయన స్కూలు చదువు చదువుకోలేదు కాని, స్వయంకృషితో ఇంగ్లీషు పుస్తకాలుకూడా చదివే స్థాయికి ఎదిగారు.
(కొరవ 'తదుపరి' పుటలో చూడండి) |