చందమామ, ఆ పేరులోనే ఏదో మహత్తు ఉన్నట్టుంది. నెలకొకసారి నింగిలో మెరిసిపోయే చందమామ అన్నా, నిండుగా చేతుల్లో ఒదిగిపోయే చందమామ అన్నా ఇష్టపడని వారు ఎవరు? నామటుకు నాకు చందమామ అన్నా, దానిలో బుజ్జిగా ఒదిగిపోయిన కుందేలు పిల్ల అన్నా మహా ఇష్టం, ఇది నేల మీద జాబిల్లి గురించే నింగిలోని జాబిల్లి గురించి కాదు.
మాకు పుస్తక పఠనాభిలాష మా అమ్మగారి నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి నెలా మొదటి వారంలో నాన్న గారి సైకిల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళము నేనూ, నా అన్నయ్యలూ. నాన్న సైకిల్ దిగటంతోనే యుద్ధం మొదలు, చందమామ నేను మొదట చదవాలీ అంటే నేను మొదట చదవాలి అని.
చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడూ ఓడిపోయేదాన్ని నేను, వాళ్ళిద్దరు చదివిన తర్వాత అంటే సుమారుగా వారం తర్వాత వరకూ నా చేతికి చిక్కేది కాదు చందమామ. నాకేమో కొత్త పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకుని అందులోంచి వచ్చే ఒకలాంటి కమ్మటి సువాసనని ఆస్వాదిస్తూ చదవాలి అని తెగ కోరిక, కానీ అది చాలా యేళ్ళ వరకూ తీరలేదు.
ఇంక చందమామ చేతిన పడ్డ వెంటనే ముందుగా నా కళ్ళు వెతికేది మాత్రం విక్రమార్కుడి గురించే. అదేంటో ప్రతి నెలా అదే బొమ్మ ఉంటుంది అని తెలిసినా సరే ఒకసారి ఆ చురకత్తిలాంటి చూపులు, ఆ కోరమీసం, ఆ వొంపు తిరిగిన పాద రక్షలూ, ఠీవీగా ఆ చేతుల్లో మెరిసిపోయే ఖడ్గం, పక్కన చెట్టు మీద నవ్వుతున్నట్టుగా ఉండే కపాలాలు వీటిని చూస్తే కానీ చందమామ చదివిన అనుభూతి వచ్చేది కాదు.
గట్టిగా కూర్చుని చదివితే గంటలో అయిపోతుంది మొత్తం పుస్తకం, మళ్ళా నెల రోజుల వరకూ ఎదురు చూడాలి అందుకే రోజుకి ఒక్క కథ మాత్రమే చదవాలి అని నాకు నేనే ఒక రూల్ పెట్టుకుని ప్రతి కథని కామాలూ, ఫుల్ స్టాప్‌లతో సహా చదివేదాన్ని.
కొరవ తదుపరి పుటలో చూడండి. |