చరిత్రలో కొన్ని ఘటనలకు అద్భుతగుణాలు, మహిమలు ఆపాదించబడుతుండటం మనకందరికీ తెలిసిన విషయమే.. హంపీ చరిత్రలో కుందేలు రేచుకుక్కను తరిమిన ధీరగాథ చాటువులుగా ఈ నాటికీ జనం నోళ్లలో నానుతూ ఉంది. ఒక సామ్రాజ్యం కాని, ఒక చరిత్ర కాని, దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఆ కొనసాగింపు వెనుక నేపథ్యం గురించి కథలు కథలుగా చరిత్రలో వ్యాప్తిలోకి వస్తుండటం కూడా కద్దు. చరిత్రను ప్రభావితం చేసిన ఘటనలు పలురూపాలల్లో జనం మధ్య ప్రచారంలో ఉంటూ రంజింపజేస్తుంటాయి కూడా.
మరి చందమామ పత్రికతో చిత్రకారుడు శంకర్ గారి అనుబంధం మాటేమిటి? దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చందమామ-శంకర్ సాంస్కృతిక బంధం మాటేమిటి? ఒక చిత్రకారుడు తన జీవితంలో ముప్పావు భాగాన్ని చిత్రలేఖనానికి అంకితం చేయటం ఏమిటి? అందులోనూ తెలుగువారి "సాంస్కృతిక రాయబారి" అని గుర్తింపుకు నోచుకున్న చందమామలో గత యాభైఆరేళ్లుగా నిర్విరామంగా బొమ్మలు గీసుకుంటూ పోవడం ఏమిటి?
ఇది బహుశా ఘనతవహించిన ఓ సామ్రాజ్యపు కథ కాకపోవచ్చు. లేక అరుదైన ఘటనలతో ఉక్కిరి బిక్కిరి చేసే చరిత్ర కానే కాకపోవచ్చు.. కాని చందమామ పత్రికలో శంకర్‌గారు చేరిన క్రమానికి తనదైన చరిత్ర ఉంది. యజమానుల విశ్వాసం, ఉద్యోగుల కృతజ్ఞత పరస్పరం అల్లుకున్న మానవీయబంధం ఈ చరిత్రతో పెనవేసుకునిపోయింది. అందుకే శంకర్‌గారు అద్భుత చిత్రకారుడిగా ఎదుగుతూ రావడం ఎంత వాస్తవమో... ఆ ఎదుగుదలలో అధికభాగం చందమామతోటే ముడిపడి ఉండటం కూడా అంతే వాస్తవం.
ఇది నాగిరెడ్డి గారి సంకల్పానికి, శంకర్ గారి విధేయత, కృతజ్ఞత తోడైన గొప్ప పరిణామానికి నాంది. జీవితం చివరి వరకు చందమామతోనే ఉంటానని శంకర్ గారు మొదట్లో ఎక్కడా ప్రకటించలేదు. కాని 85 ఏళ్ల ముదివయస్సులో పడ్డాక ఆయన తన జీవితంలో ఒకే ఒక కోరికను గట్టిగా కోరుకుంటున్నారు. చివరి శ్వాస వరకు చందమామతోనే ఉంటానన్నదే ఆ కోరిక.
ఇంతటి పటుతర బంధం చందమామతో ముడిపటడానికి దారితీసిన పరిస్థితులేమిటి, దానిపై వ్యక్తుల ప్రభావం ఏమిటి, దాన్నే శంకర్ గారు ఇలా గర్వంగా ప్రకటిస్తున్నారు. "నాగిరెడ్డి గారి పిలుపుతో నేను చందమామలో చేరాను. ఏ ముహూర్తంలో అడుగుపెట్టానో కానీ, 55 ఏళ్లకు పైగా దాంట్లోనే కొనసాగుతూ ఉన్నాను. ఆయన పిలిచారు. నేను వచ్చాను అంతే. ఆయన ఇవ్వాళ లేరు. అయినా నా సంకల్పం మారలేదు. చివరిదాకా చందమామలోనే కొనసాగాలనే కోరికా మారలేదు. వయసు సహకరించక ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇష్టమైన బొమ్మలు వేయకుండా ఉండలేను." ఇది ఆయనకే సాధ్యమైన దృఢసంకల్పం.
చందమామ చిత్రకారుడిగా దశాబ్దాలపాటు ఆయన సృష్టించిన ఘనత, రికార్డులు మనందరికీ కొద్దో గొప్పో తెలుసు. అయితే తమిళ పత్రికలోంచి చందమామలోకి ఆయన రాక, తదనంతర పరిణామాలు గురించి ఏ కొద్దిమందికో గాని తెలిసే అవకాశం లేదు. ఈ వారం చందమామలో అడుగుపెట్టిన వేళావిశేషపు ఘనతను ఆయన ద్వారానే తెలుసుకుందాం.
కొరవ తదుపరి పుటలో చూడండి. |