చందమామ చిత్ర మాంత్రికుడు శంకర్ గారి పూర్తి పేరు కెసి శివశంకర్. 1924 జూలై 7న కోయంబత్తూరు జిల్లా, ధర్మపురం తాలుకాలోని కారత్తొళువు గ్రామంలో పుట్టారు. పూర్తి పేరు కారత్తొళువు చంద్రశేఖరన్ శివశంకరన్. కారత్తొళువు పుట్టిన ఊరు. చంద్రశేఖరన్ తండ్రి పేరు. సొంతపేరు శివశంకరన్ లేదా శివశంకర్.
తల్లిదండ్రులు విజయలక్ష్మి, చంద్రశేఖరన్. ఈ దంపతులకు అయిదుగురు సోదరులు, వీరిలో ఇద్దరు పోయారు. మిగతా ముగ్గురు సోదరులలో ఈయన మాత్రమే చిత్రలేఖన వృత్తి చేపట్టారు. ఇక ఈయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రిలాగే వీరు కూడా చెన్నయ్ ఎగ్మూరులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరి సర్టిఫికెట్ తీసుకున్నారు కాని అదే వృత్తిలో కొనసాగలేకపోయారు.
పిల్లలకు చిత్రలేఖనంలో అంతగా ఫర్ఫెక్షన్ లేకపోవడమే దీనికి కారణమని శంకర్ గారు మాటల సందర్భంగా చెప్పారు. తర్వాత వేరే చదువుల బాట పట్టి వీరి పిల్లలు ఇతర రంగాలకు వెళ్లిపోయారట. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను అయినా సరే ఒత్తిడి చేసి బలవంతంగా ఏ వృత్తిలోకి చేర్చకూడదని శంకర్ గారి అభిప్రాయం.
ఎగ్మూరులో ఈ నాటికీ ఉన్న స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో తను చదివిన రోజుల్లో శంకర్ గారు నమ్రతగా ఉండేవారు కాని ఓ సందర్భంలో విద్యార్థుల స్కాలర్ షిప్ విషయంలో గొడవ బయలుదేరినప్పుడు స్టూడెంట్ యూనియన్ పెట్టి పై అధికారులపై పోరాటం చేసి ఎట్టకేలకు స్కాలర్షిప్ సాధించారట. దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత ఎప్పుడు తను ప్రిన్సిపాల్‌కు కనపడినా 'రావోయ్ ట్రబుల్ సమ్' అని పిలిచేవారట.
తాను ముందుండి విద్యార్థులను కూడగట్టి స్కాలర్షిప్ సమస్యపై పోరాటం చేసినప్పటికీ, ప్రిన్సిపాల్ తనపై కోపం పెంచుకోలేదని, మార్కులు బాగా రావడంతో తాను బతికిపోయానని అంటారు. చివరకు కోర్స్ పూర్తయ్యాక కాండక్ట్ సర్టిఫికెట్లో కూడా 'గుడ్' అని రాసిన విషయం శంకర్ గారు తలుచుకుని సంతోషపడ్డారు. అయితే విద్యార్థుల న్యాయమైన సమస్య కాబట్టి ఇలాంటి తిరుగుబాటు మంచిదేనని ఆయన అంటారు.
సంక్షిప్తంగా జీవిత వివరాలు
వాస్తవ జన్మదినం: 07-07-1924 చదువు: ఎస్ఎస్ఎల్సి. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రలేఖన కోర్సు పూర్తిచేశారు. 1946 నుంచి 1952 అక్టోబర్ వరకు తమిళ పత్రికల్లో చిత్రలేఖన పనిలో ఉన్నారు 1952 నవంబర్‌లో చందమామలో చేరారు. 1996లో చందమామ తాత్కాలికంగా ఆగిపోయింది. శంకర్ గారు దీన్నే 'చందమామ అజ్ఞాతవాసం' అంటారు. చందమామలో తిరిగి చేరిక 15-11-1999. అప్పటినుంచి చందమామతో కొనసాగుతున్నారు.
|