చిన్నప్పటి విషయాలు అందరికీ అన్ని గుర్తుండవు. నా సంగతీ అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నెలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా. |