చందమామంటే నాకు అమ్మ చేతి గోరుముద్ద,
నాన్న గారాబం,
చెల్లెలితో పేచీ,
అన్నయ్యతో లాలూచీ!
చందమామలేకుండా బాల్యముంటుందంటే కొద్ది రోజుల క్రితం వరకూ ఆశ్చర్యమే!
ప్రతినెలా మొదటివారంలో పేపర్ బాయ్ తెచ్చే చందమామ కోసం వరండాలో పడిగాపులు కాస్తుంటే ఎదురుచూపులంటే ఎలా వుండేవో తెలిసేది. చందమామను అందుకోడానికి అన్నయ్య, నేను, చెల్లితో పాటు ఇంకొకరు పొటీ పడేవారు. అది మా నాన్నగారు. ఒక్కోసారి మమ్మల్ని అధికార దుర్వినియోగంతో మొట్టికాయలేసి తనే దక్కించుకుని జానపద సీరియల్ చదివి అప్పుడు కానీ మాకిచ్చేవారు కాదు.
కానీ ముందుగా పుస్తకం అందుకుని మృదువైన కవర్ పేజీని తడుముతూ, కొత్త పుస్తకం సువాసనను ఆఘ్రాణిస్తూ, ఎవరికీ ఇవ్వకుండా చదువుకోవడంలో ఉన్న మజా ఇంకెవరో చదివేసి మన చేతికొచ్చాక ఏముంటుంది? చందమామను మొదటగా చేజిక్కించుకునేందుకు ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఈ పోటీ ఎంతవరకూ వెళ్ళిందంటే నాన్నగారు మాతో పడలేక చందమామను ఆఫీసుకు తెప్పించుకుని అక్కడే చదివేసి సాయంత్రం వస్తూ ఇంటికి తెచ్చేంత వరకూ!
నాకు బాగా గుర్తున్నవి, మొదట్లోనే ఉండే పంచతంత్ర కథలు "కాకోలుకీయం"(ఈ మాటకు ఈ మధ్య వరకూ అర్థం తెలీదంటే నమ్మండి) మాచిరాజు కామేశ్వర రావు గారి పిశాచాలు, దెయ్యాల కథలు, నా అభిమాన సీరియల్ వీర హనుమాన్, చివర్లో సింగిల్ పేజీ కథ ఒకటి ఇచ్చి దానికి పేరు పెట్టమనే చిన్న పోటీ!
ఆఖరుపేజీలో ఫొటోలకు వ్యాఖ్యలు రాయడం, అలాగే సింగిల్ పేజీలో ఇచ్చే కథలకు ప్రతినెలా పేర్లు పెట్టడమే కానీ పంపిన పాపాన ఒక్కసారీపోలేదు. డబ్బు, నగల మూటల్తో అవసరానికి ఆదుకునే పిశాచాలు ఒక్కటి కూడా నిజంగా తారసపడకపోవడం అప్పట్లో ఒక తీరని కోరికగా ఉండేది.
చందమామ చదవడం వల్ల కలిగే మానసికానందం ఒక ఎత్తయితే చందమామ వల్ల కలిగిన మహోపకారం భాష మీద ప్రేమ! సాహిత్యాభిలాషకు బాటలు వేసే సరళమైన భాష మీద ఎవరికైనా ప్రేమ కలిగి తీరుతుంది. పిల్లల పత్రికలు ఎన్నో ఉన్నా, తల్లిదండ్రుల మొదటి ఎంపికగా చందమామ నిలబడిందంటే అందుకు కారణం భాషే! అందుకే ఇంతకు ముందెవరో తమ జ్ఞాపకాల్లో చెప్పినట్లు చందమామకు బాల్యంలో దూరమైన వారు సాహిత్యానికి దూరమయ్యారంటే నాకు ఆశ్చర్యం కలగదు. |