చందమామ’ అంటే అమాయకమైన, అందమైన నా బాల్యం!
చందమామ పేజీల్లోకి చూపులు సారిస్తే... చెప్పలేనంత పరవశం. ఆ అక్షరాలు ఊహలకు రెక్కలు తొడిగేవి. అద్భుత కథల లోకాల్లోకి అలవోకగా తీసుకెళ్ళేవి. అంతులేని కుతూహలాన్ని రేకెత్తించేవి.
ఉత్కంఠ కలిగించే కథలూ, ధారావాహికలూ; కథలో పాత్రలకు ప్రాణం పోసే అద్భుతమైన రంగుల బొమ్మలూ... !
ముఖ్యంగా జానపద, పౌరాణిక ధారావాహికల్లో పేజీ సైజులో మురిపించే అపురూప చిత్రాలు నా చిన్ననాటి స్మృతులను వర్ణ రంజితం చేశాయి.
అవి ఏవో మామూలు బొమ్మలని అనిపించవెప్పుడూ. జీవం తొణికిసలాడుతూ కథల్లో భాగమౌతాయి. చాలాసార్లు కథలకే కొత్త అందాలను సంతరిస్తాయి. ఒక్కోసారైతే ఆ కథలనే మించిపోయేంతగా మురిపిస్తుంటాయి!
‘ఎప్పుడైనా అరణ్యాలను చూశావా?’ అని ఎవరైనా అడిగితే ‘లేదు!’ అని చప్పున చెప్పాలనిపించదు. ఎందుకంటే కీకారణ్యాలూ, కారడవులూ నాకు సుపరిచితమే అనిపిస్తుంది. అందమైన ఆకులూ, పూలూ, ఫలాలతో పొడుగ్గా, విశాలంగా పెరిగిన వృక్షాలూ; ఆ చెట్లను పెనవేసుకుపోయే ఊడలూ; నేల మీద హొయలు పోయే రెల్లు పొదలూ ... సుదూరంగా కొండలూ ... ఇలా అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.
చందమామ సంపాదకీయం ఉండే ‘హంసల బొమ్మల’ పేజీ చూడటం ఇష్టంగా ఉండేది. అంత చిన్న వయసులో కూడా ఆ పేజీపైన ఉండే ‘చక్రపాణి’, ‘నాగిరెడ్డి’ గార్ల పేర్లు బాగా గుర్తుంచుకున్నాను.
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
( కొరవ తదుపరి పేజీలో చూడండి )
|