నాన్న చేతిలో పుస్తకాలు, వేమన పద్యాలూ, సుమతీ శతకం కష్టంగానూ, నాకు నేను ఇష్టంగా చదవగలిగింది నాకు గుర్తున్నంత వరకూ చందమామ మాత్రమే. చందమామ అనగానే రంగురంగుల అట్ట మీద బొమ్మ, లోపల ఏ బొమ్మైనా తెలుపు నీలిరంగు, లేదా తెలుపూ, వూదా కలిసిన పింకూ, ఇలా ఉండేది.
ఐతే చక్కటి రాజకుమారి వంటి నిండా నగలతో ముఖం కనిపించే పలుచటి ముసుగు (సాలార్ జంగ్ మ్యూజియంలో రెబెక్కా లాగా) ఉద్యానవనంలో వ్యాహ్యాళికి వెళితే ఆ ఉద్యానవనంలో ఉండే చిన్న చిన్న పొదలూ వాటి నిండా సందులేకుండా పూలూ, కల్పన అనే అనుకున్నాను మొన్న మొన్న స్టాంఫార్డ్ లో స్ప్రింగ్ చివర్లో విరపూసిన అజేలియాలని చూసిందాకా. చూడగానే చిన్నప్పటి చందమామ కధల్లో రాకుమారి తోట గుర్తుకొచ్చింది.
ఎర్రటి ఎండ, మజ్జిగ, కొద్దిగా ఉప్పు కలిపిన అన్నము, నంజుకునేందుకు దోసకాయి పచ్చడి, చందమామలో చీనాదేశపు రాకుమారి కధ. కధానాయకుడు వాంగో, చాంగో అయివుంటాడు. తెలుపు రేడియం గ్రీను కలిసిన కిమోను వేసుకుని నడినెత్తిన ముడి, ముడిలో అడ్డంగా పుల్ల (ఇప్పుడైతే ఆ పుల్ల నాదగ్గరకూడా ఉన్నది. చైనా ట్రిప్ వెళ్ళొచ్చిన నా స్నేహితురాలు బహుమతిగా ఇచ్చింది) ఇలాంటి బొమ్మతో కధ చదివిందే ఓ ఇరవైసార్లు చదవడం. ఇవన్నీ అర కొర ఙ్ఞాపకాలే, బాగా గుర్తున్నది, పిశాచం కధ.
ఒక ఊరిలో ఒక వ్యక్తి (పేరు గుర్తులేదు, సోమరి కానీ తెలివిగలవాడు. ఆ ఊరి మర్రి చెట్టు మీద ఓ నాలుగు పిశాచాలు కాపురముంటాయి వచ్చీ పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓ రోజు మన హీరో ఏదో పని మీద ఆ మర్రిని దాటాల్సివస్తుంది. భయపడుతూనే ఒక చేతి మూటలో అరటి పండ్లు, ద్రాక్ష పండ్లూ, జామ కాయిలు, మామిడిపండూ మూట గట్టుకుని బైలు దేరుతాడు.
కొరవ తదుపరి పుటలో చూడండి. |