చందమామ చిత్రకారుడు శంకర్ గారి మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఉద్యోగ జీవితం 1946లోనే మొదలైంది. 1952లో చందమామలో చేరారు. అంటే ఆయన మొత్తం ఉద్యోగ జీవిత కాలం ఇప్పటికి 64 ఏళ్లు. వయస్సు 85 ఏళ్లు. దేహం పండిపోయి, సహకరించని కాళ్లతో, భారంగా అడుగులేస్తూ కూడా, పనిచేయకపోతే పొద్దు పోదనే పాత తరం సంస్కృతికి నిలువెత్తు అద్దంలా నిలుస్తూ, చందమామతో నిండు జీవితం పండించుకున్న నిరుపమాన వ్యక్తి శంకర్ గారు.
నాగిరెడ్డి గారి పేరు చెబితే నిలువెల్లా కదిలిపోవడం శంకర్ గారి నైజం. కేవలం వారు తనకు అందించిన మంచి అవకాశం కారణంగానే చందమామతో తన జీవితాన్ని ముడివేసుకున్నానని చెబుతారాయన. ఇదే విషయంపై మాట్లాడుతూ 'Till my last breath... I will be with Chandamama' (చివరి శ్వాస వరకు చందమామతో ఉంటా..) అని ఉద్వేగంగా ప్రకటించారు.
చిత్రాగారు కుంచెతో, తాను చేతితో గీసే విధానం పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయిన సందర్భంలో 'చిత్రా, శంకర్లు చందమామలో జోడెద్దుల్లాంటి వారు. పని సజావుగా సాగేంతవరకు వారి ఇచ్ఛప్రకారమే పనిచేయవచ్చు' అని నాగిరెడ్డిగారు గతంలో అన్న వ్యాఖ్యలను తలచుకునీ మరీ కదిలిపోయారు.
చివరిశ్వాస వరకు చందమామతోనే ఉంటా అని ప్రకటించుకోవడం శంకర్ గారి మూర్తిమత్వపు గొప్పే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక చిత్రకారుల ఉద్యోగ జీవితాలతో పోలిస్తే ఆయన ఎవరూ ఊహించలేనంత తక్కువ వేతనం ప్రాతిపదికనే చందమామలో దశాబ్దాలుగా పనిచేశారు. దానికి ఆయన ఏ రోజూ బాధపడింది లేదు.
పరమ సాంప్రదాయవాది, భక్తిపరుడుగా ఉంటున్న శంకర్ గారిది పెద్ద కుటుంబమే... తనకు వచ్చే చాలీ చాలని జీతం ఏ మాత్రం సరిపోదని అర్థమవుతూనే ఉన్నప్పటికీ అన్నీ పైవాడే చూసుకుంటాడు లెమ్మనే తత్వం ఆయనది. జీవితం ప్రసాదించినవాడు జీవించడం ఇవ్వలేకపోతాడా..! అనేది ఆయన జీవన తత్వం.
గత సంవత్సరం మాత్రమే ఆయన వేతనం రెట్టింపు అయ్యిదంటే బహుశా ఎవరూ నమ్మలేరు. అది కూడా ప్రస్తుత జీవన వ్యయంతో పోలిస్తే చాలా తక్కువే. అయినప్పటికీ చందమామ యాజమాన్యం తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో ఇదీ ఒకటిగా చెప్పవచ్చు.
"ఏదైనా సంస్థలో ఒక డికేడ్ పనిచేయడమే గొప్ప. అలాంటిది 6 దశాబ్దాలుగా చందమామలో పనిచేస్తున్నారు. ఎలా సాధ్యమైంది మీకు" అని రెట్టిస్తే... 'చందమామలో పనిచేయడం, అదీ ఇంత సుదీర్ఘకాలంగా పనిచేయడం తన అదృష్టమ'ని చెప్పారాయన. 'ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దేవుడిచ్చిన వరం' అనేశారు. |