తెలుగు కథా సాహిత్యంలో, ఇంకా చెప్పవలసి వస్తే భారతీయ కధాసాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘ ధారావాహిక బేతాళ కథలకు చిత్రాలు గీసిన వారు శంకర్ గారు. బేతాళ కథలకు ముఖచిత్రం మాత్రమే కాకుండా ఇంతవరకు 300 పైగా బేతాళ కథలకు లోపలి చిత్రాలు -ఇన్సైడ్ చిత్రాలు- గీసింది శంకర్ గారే.
చందమామలో పౌరాణిక ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం ధారావాహికలకు లోపలి పుటల్లో చిత్రాలు గీసినవారిలో శంకర్ గారు అగ్రగణ్యులు. అలాగే జాతక కథలు, విష్ణుపురాణం వంటి ధారావాహికలు, కథలకు కూడా ఈయనే చిత్రాలు వేశారు.
1952లో చందమామలో చేరిన శంకర్ గారు చందమామ అజ్ఞాతవాసం చేసిన ఆ ఒకటన్నర సంవత్సరం కాలం (1996-98) మినహా ఇంతవరకు అంటే 56 ఏళ్లపాటు చందమామ పత్రికలోనే పని చేస్తున్నారు.
ఆరు నెలలు పనిచేస్తే చాలు.. వెంటనే మరో చోట అవకాశాలు వచ్చి ఆఫీసులను వదలి వెళుతున్న తరహా సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అలాంటిది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదన్నర దశాబ్దాల పైగా అవిరామంగా ఒకే పత్రికలో ఒక వ్యక్తి పనిచేయగలగడం... చరిత్రలో అరుదైన విషయమే. ఇలాంటి అరుదైన ఘటనలు చందమామలోనే జరగడం మరీ విశేషం.
(చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కూడా దాదాపు 56 ఏళ్లపాటు పనిచేసి ఇటీవలే -2006- చందమామ నుంచి పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.)
కొరవ తదుపరి పుటలో చూడండి
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
|