ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల.
తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయారు.
వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.
బాల్యం
ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.సూర్యనారాయణగారు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు.
ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ గారు మరణించారు. చివరిరోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్యగారు చూసుకోవడం మొదలుపెట్టారు.
సంగీత సాధన
తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేసాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీ పడి ఓడిపోయి నవ్వులపాలు అయ్యాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు.
రెండేళ్ళ కాలంలో ఒక ఇంట్లో బాగా బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమయినా తన తప్పు తెలుసుకొన్న ఘంటసాల తన దగ్గర ఉన్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నారు.
విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు.
ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
|