చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారు. 1952లో చందమామ చేయి పట్టుకుంది మొదలుగా 54 ఏళ్లపాటు చందమామలో అవిశ్రాంతంగా పనిచేసి తెలుగు జాతికి, భారతీయ కథల ప్రేమికులకు కథామృతాన్ని మంచిపెట్టడమే కాక, ఆణిముత్యాల వంటి 12 జగమెరిగిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు. ఆయన వయస్సు 85 ఏళ్లు. ఆయన కనుమూసిన వార్తను చందమామ అభిమానులకు, పాఠకులకు చెప్పడానికి తీవ్రంగా విచారిస్తున్నాం.
ఎనిమిది పదుల పైబడి వయసులో కూడా జీవించి ఉండటంపై తనకు తానే సెటైర్ వేసుకుంటూ ‘I am overstay here’ అని ఓ ఇంటర్వూలో చెప్పుకున్న సుబ్రహ్మణ్యం గారు జీవితం చివరివరకూ ఆరోగ్యంగానే ఉంటూ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా విజయవాడలో తన అన్న కుమార్తె గోళ్ల ఝాన్షీ ఇంటిలోనే చివరి శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారికి మెయిల్ చేస్తూ ప్రజాసాహితి సంపాదకులు దివికుమార్ గారు వ్యాఖ్యానించినట్లుగా తనను ఆసుపత్రిలో చేర్పించడానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాసరి గారు సునాయాస మరణం పొందారు.
“Daasari Subrahmanyam garu passed away.Very easy death, not given any chance to hospitalise -DVK”
చందమామ కథల మాంత్రికుడు : దాసరి సుబ్రహ్మణ్యం
దాసరి సుబ్రహ్మణ్యం గారు 29వ ఏట చందమామ పత్రికలో అడుగుపెట్టారు. కథా కల్పనలో, ధారావాహికల రచనా ప్రక్రియలో అసాధారణ ప్రతిభ కలిగిన ఈయన అయిదు దశాబ్దాలపాటు చందమామలో పనిచేశారు. బాల సాహిత్య రచనలో ఆయన ప్రతిభాపాటవాలను స్వంతం చేసుకోవాలని అప్పటి పత్రికలు తీవ్రంగా ప్రయత్నించినా ఆయన చందమామకే చివరివరకూ అంకితమయ్యారు.
చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి.
బాల్యం తెనాలి సమీపంలో చుండూరు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెద గాజులూరులో దాసరి సుబ్రహ్మణ్యం జన్మించారు. పెద్దగా చదువుకోనందున జన్మదినం గురించిన రికార్జులు నమోదు కాకపోవడంతో తన అక్కగారి వయసు ననుసరించి ఆయన లెక్కగట్టిన ప్రకారం 1922లో ఆయన పుట్టారు. కుటుంబ పెద్దలు 1929లో గాజులూరులో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి రేపల్లె సమీపంలోని కైతేపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా పొలాలు సరిగా పండకపోవటంతే 1932 ప్రాంతాల్లో రేపల్లె చేరారు. తర్వాత అక్కడే ఆయనకు వివాహమై ఓ కూతురు పుట్టింది.
అయితే తన జీవిత కాలంలో అధికభాగం ఆయన మద్రాసులో ఒంటరిగానే గడిపారు. చందమామలో చేరింది మొదలుకుని ఆయన మద్రాసులో ఒకే అద్దె ఇంటిలో యాభైఏళ్లకు పైగా గడపడం విశేషం. ఓ ప్రత్యేక కారణం వల్ల మద్రాసులో అయిదు దశాబ్దాలకు పైగా తానున్న అద్దె ఇంటిలో తన వాటాను ఇప్పటికీ చెల్లిస్తూ చెన్నయ్తో తన సంబంధాన్ని ఈనాటికీ పరోక్షంగా కొనసాగిస్తున్నారు.
(కొరవ తదుపరి పుటలో చూడండి)
|