Memories with Dasari thatha sir
(చందమామతో పరిచయం ఉన్న, చందమామ ధారావాహికలతో పరిచయం ఉన్న పాఠకులు, అభిమానులు అందరికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు. నాలుగేళ్ల క్రితం ఆయనతో కలిసి పనిచేసిన చందమామ ఉద్యోగులు, సిబ్బంది విషయం ఏమిటి? ఆయన పూర్వ సమకాలికులు చాలావరకు ఇప్పుడు లేరు. రెండు, మూడు తరాల అనంతరం చందమామలు చదువుతూ, బేతాళ కథల మహత్తులో మునిగితేలుతూ బాల్యం గడిపి చందమామలో పనిచేసే అవకాశం వచ్చిన పిల్లలు, ప్రస్తుత చిత్రకారులు, సిబ్బంది ఆయనతో ఎలా గడిపారు, ఆయన వ్యక్తిత్వాన్ని వారు ఎలా పరిశీలించారు అనే ఆసక్తితో రెండు రోజులు క్రితం వారిని కదిపి అందరూ ఆయన జ్ఞాపకాలను పంపితే తెలుగు పాఠకులకు, దాసరిగారి అభిమానులకు తెలిపేందుకు వీలవుతుందని ప్రస్తావించాము.
వెంటనే ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కింద ప్రస్తావించిన వారు తమ జ్ఞాపకాలను పంపారు. ఆయన మనవరాళ్ల వయసులో ఉన్నవారు, మనవళ్ల ప్రాయంలో ఉన్నవారు చందమామలో ఆయనతో గడిపిన మాన్య క్షణాలను గుర్తుచేసుకుంటూ హృద్యంగా తెలుగు చందమామతో పంచుకున్నారు. వీళ్లందరూ ఆయనకు పెట్టుకున్న ముద్దుపేరు తాతా సర్.
ఆయనతో మాట్లాడడానికి గాను తెలుగు నేర్చుకుని తర్వాత ఆయన ఇంగ్లీషులో కూడా మాట్లాడగలరని తెలిసి ఆశ్చర్యపోయిన వారు, స్వంతబిడ్డలకు నజరానాలు ఇచ్చినట్లు రోజూ గులాబి పూవులు ఇస్తే ప్రీతిగా అందుకున్న చందమామ పాపలు, ఆయనతో చుట్టపీలుస్తూ ఆరుబయట చర్చలు గడిపిన కాలాన్ని జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా భావించుకుంటున్న వారు, ఆఫీసు బాయ్‌ని అయినా, సరిసమాన ఉద్యోగులనయినా సమానంగానే చూసి ఆప్యాయత కురిపించిన ఆయన మూర్తిమత్వాన్ని సజలనేత్రాలతో తల్చుకుని బాధపడినవారు, చందమామలోనే చిన్న లైబ్రరీలాగా స్వంత పుస్తకాలను అమర్చుకున్న వైనాన్ని వర్ణించినవారు... ఇవి చందమామ ఉద్యోగులు, సిబ్బంది నిరాడంబరుడైన దాసరి తాత గురించి పంచుకున్న క్షణాలు.)
Vaasugi వాసుకి (జూనియర్ చందమామ అసోసియేట్ ఎడిటర్)
చాలామంది పిల్లల్లాగే నేను కూడా చందమామ -హిందీ-తోపాటే పుట్టి పెరిగాను. చందమామలో నాకు బాగా నచ్చింది బేతాళ కథలు. వీటిని ఎంతగా ఇష్టపడేదాన్నంటే, చదివాక మా బంధువుల పిల్లలు, స్నేహితులు అందరికీ ఊరించి, ఊరించి చెప్పేదాన్ని.
చందమామలో నేను చేరినప్పుడు నా చిన్నప్పుడు ఎంతగానే ఆరాధించిన గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నానని నేను కల్లో కూడా ఊహించలేదు. అప్పటికే 83 సంవత్సరాల వయసున్న దాసరి గారు ఇంకా బేతాళకథలు రాస్తూనే ఉన్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఆఫీసులో చేరిన కొత్తలో ఆయన వద్దకు అస్సలు వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే తన మాతృభాష తెలుగుతో నాకు పరిచయంలేదు. కాబట్టి పట్టుబట్టి తెలుగు మాట్లాడటం కొద్దిగా నేర్చుకున్నాను. తర్వాతే ఆయన కేబిన్ దగ్గరకు వెళ్లాను. నేను ఆయనతో తెలుగులో మాట్లాడటం ప్రారంభించేసరికి ఆయన ఇంగ్లీషులో సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన రెండు భాషల్లోనూ ఉద్దండులని అప్పటికి కాని నాకు బోధపడలేదు. నిజంగానే ఆయన ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడేవారు.
చందమామ ఆఫీసులో మేమంతా ఆయనను తాతా అని పిలిచేవారం. ఆయన కూడా మమ్మల్ని తన మనవరాళ్లుగా భావించి వ్యవహరించేవారు. నాకు, నా సహోద్యోగి రేవతికి ఆయన దాదాపు ప్రతిరోజూ ఒక గులాబీ పువ్వు ఇచ్చేవారు. ఆయన మమ్మలను ఎంతో ప్రీతిగా చూసేవారు. మా భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించేవారు.
వ్యక్తిగా ఆయన చాలా నిజాయితీపరుడు, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన ఖాళీగా ఉండటం మేం ఎప్పుడూ చూడలేదు. అద్భుతమైన మనోబలం, ఆత్మవిశ్వాసంతో ఆయన సొత్తు. తెల్లచొక్కా అంటే ఆయనకు చాలా యిష్టం. అందుకని తన జన్మదినమైన అక్టోబర్ 25న మేం ఆయనకు తెల్లచొక్కా, ప్యాంట్‌ను బహుమతిగా ఇచ్చాము. ఆరోజు అంతా ఆయన చాలా సంతోషంగా గడిపారు. మమ్మల్నందరినీ నిండుమనసుతో ఆశీర్వదించారు.
నాలుగేళ్ల క్రితం చందమామ కార్యాలయాన్ని వదిలివెళ్లవలసి వచ్చినప్పుడు, కోలుకున్నాక తిరిగి వస్తానని ఆయన మాతో చెప్పారు. కానీ గత నెల 27న ఆయన పోయారని మర్నాడు విన్నప్పుడు విషాదంలో మునిగిపోయాను.
Ravathi రేవతి - లేఅవుట్ డిజైనర్
నా మనస్సులో అణువణువునా నిండి ఉన్న దాసరి తాత గురించి చెబుతున్నాను. మొదట్లో ఆయన పేరు నాకు తెలిసేది కాదు. మాకందరికీ ఆయన తాతా సర్ గానే బాగా పరిచయం. తను చాలా మంచివ్యక్తి. అంత సరదా మనిషి కూడా. అంతకు మించి మహా ఔదార్యవంతుడు. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే నన్ను ఒక బిడ్డలాగా చూసేవారు. ఆయన దేవుడిని ఎప్పుడూ నమ్మేవాడు కాదు. అందుకే ప్రతిసారీ ఆయనతో దేవుడున్నాడని వాదించేదాన్ని. మా చర్చ, వాదన భలే తమాషాగా ఉండేది. చాలా సందర్భాల్లో తాత మొహంలో నిండా చిరునవ్వుతో ఒక పువ్వు ఇచ్చేవాడు. దీంతో నా కోల్లీగ్స్ ఆటపట్టించేవారు. అంతే చుట్టూ పెద్దగా నవ్వులు. నిజంగా అవి చాలా మంచిరోజులు. ఇప్పటికీ ఆయన గురించి తల్చుకుంటే చాలు నా కళ్లలో నీళ్లు నిండతాయి. నా మనో ప్రపంచంలో ఆయన అంతగా ఉండిపోయారు. నా జీవితంలో అంత గొప్ప మనీషిని నేను కలుసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు.
కొరవ తదుపరి పేజీలో - pls. see in next page |