కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు ఇంజనీర్స్ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు.
కృషి
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.
కాటన్ 1836-38 సంవత్సరాలలో కావేరీ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847-52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది.
తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్దే.
ఇంతేకాక ఆయన బెంగాల్, ఒరిస్సా, బీహార్, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులు.
ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
|