(క్రింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను అంటూ తెలుగు పిల్లలకు ముద్దు ముద్దు మాటలు చెబుతూ 'చందమామ' ఈ భూమ్మీద అడుగు పెట్టిన మహత్తర క్షణం అది. 1947 జూలై తొలి సంచిక సందర్భంగా చందమామ సంపాదకీయం తెలుగు పిల్లలను ఉద్దేశించి చేసిన చల్లటి పరామర్శ ఇది. ఆ పరామర్శ అచిరకాలంలోనే భారతదేశంలోని పిల్లలందరినీ మలయమారుతంలా స్పర్శించింది. చల్లగా... వెచ్చగా... నింగిలో మెరిసే చందమామలా... )
ఎలాగో ఇక్కడ చదవండి మరి!
మీకు ఊహ వచ్చినప్పటినుంచీ నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో చందమామ రావే జాబిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్లం. మీరే కాదు, మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ్వ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత, అందరూ నన్ను మామా అని పిలిచేవాళ్లు, నేను నవ్వేవాణ్ణి,
నా నవ్వు చూస్తే మీకు ఎక్కడలేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్లు! చూశారూ? మీరే కాదు, శ్రీరాముడు కూడా ఇలాగే పోరు పెట్టాడు. అప్పుడు వాళ్ల అమ్మ కౌసల్య ఏమి చేసిందనుకున్నారు? అద్దం తెచ్చి ఇచ్చింది! పాపం, అద్దంలో నా బొమ్మ చూసి నేను వచ్చానని ఏడుపు మానాడు. చూశారూ శ్రీరాముడు ఎంత అమాయకుడో!
అయితే నేను మీ ముత్తాతల, తాతల, తండ్రుల, కాలంలో రాలేకపోయాను, కాని ఇప్పుడు వస్తున్నాను. మీకూ, మీ చెల్లెళ్లకూ, అక్కలకూ, అన్నలకూ, తమ్ముళ్లకూ, కనిపిస్తాను. క్రింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను. నాకు తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు, అన్నీ మీకు వినిపిస్తాను.
ఇదుగో ఇప్పుడు కొన్ని చెప్పుతున్నాను. ఇప్పటికివి చాలు కదూ? చాలకపోతే నాకు చెప్పండి. వచ్చే నెల వాటి అన్నిటితో మీ దగ్గరికి వస్తాను
మీ
చందమామ.
|