తెలుగు జాతి గీతకర్త శంకరంబాడి తెలుగు జాతిగీతం
అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు...
అంటూ తెలుగు జాతికి తనదైన గీతాన్ని ప్రసాదించి పాడుకోమంటూ వెళ్లిపోయిన జాతి కవి శంకంరంబాడి సుందరాచారి జయంతి నేడే. తెలుగు రచయితలలో శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10,1914 - ఏప్రిల్ 8,1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. అలనాటి గాయని టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో విశ్వవ్యాపితమైన ఈ గీతం రాష్ట్ర గీతంగా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. జీవిత విశేషాలు
సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు నీకు తెలుగు వచ్చా అని అడిగాడు. దానికి సమాధానంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు.
నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి.
తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
2004 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.
|