తాటకను సంహరించి, మారీచ సుబాహులను కొట్టి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామ లక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనేలేచారు. వారు కాలకృతాలు తీర్చుకుని,విశ్వామిత్రుడూ ఇతర మునులూ ఉండేచోటికి వెళ్ళి, వారందరికీ నమస్కారాలు చేసి, విశ్వామిత్రు డితో, "మహామునీ, మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చెయ్యవలిసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి," అని అడిగారు వినయంగా.
అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు: "మిధిలానగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్పయాగం చెయ్యబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడా జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనుస్సు సంపాదించాడు. దేదీప్య మానంగా వెలిగిపోయే ఆ ధనుస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధధూప దీపాలతో అర్చిస్తూఉంటాడు. ఆ ధనుస్సును దేవతలుగాని, రాక్షసులుగాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహా బలశాలులైన రాజులూ, రాజకుమారులూ ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. కొందరయితే అసలు కదిలించలేక పోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్నీ, ఆ అద్భుదమైన ధనుస్సునూ చూడగలుగుతారు."
అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, "నేను మిగిలిన మునులందరినీ వెంట బెట్టుకుని ఇప్పుడే బయలుదేరి గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను," అని చెప్పి, సిద్దాశ్రమానికి మూడుసార్లు ప్రదక్షిణంచేసి తిరిగి వచ్చాడు. |
|
|